ప్రేమా వద్దు.. కారూ వద్దు.. ఇంటర్నెట్ చాలు: సిస్కో నివేదిక
కారు కావాలా ? ఇంటర్నెట్ కావాలా ? అని అడిగితే ఇంటర్నెట్ కావాలంటున్నారు. ప్రేమ కావాలా ? ఇంటర్నెట్ కావాలా? అని మళ్ళీ అడిగితే ప్రశ్నలో మార్పు ఉందేమోగానీ జవాబులో మాత్రం మార్పులేదు. పై ప్రశ్నలకు ఈ జవాబు ఇచ్చింది ఎవరో కాదు. నేటి తరం విద్యార్థులే ! ఇవేకాదు, ఆసక్తికరమైన మరెన్నో అంశాలను బయటపెట్టింది రెండవ వార్షిక Cisco Connected World Technology Report-2011. మానవ మనస్తత్వం, ఇంటర్నెట్ మరియు నెట్‌వర్కింగ్ మధ్యగల సంబంధాల్ని స్పృశిస్తూ ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో చేపట్టిన ఈ అధ్యయనంలోని పలు విశేషాలు భాషాఇండియా వీక్షకుల కోసం..
Cisco Connected World Technology రెండవ వార్షిక నివేదికను రూపొందించేందుకుగాను Cisco సంస్థ ఒక అంతర్జాతీయ దళాన్ని సిద్ధం చేసి సుమారు 3,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం రెండు వర్గాల్ని లక్ష్యంగా చేసుకుంది. అవి 1) కళాశాల విద్యార్థులు 2) ఇటీవలే ఉద్యోగాలు పొందిన గ్రాడ్యుయేట్లు, వీరిలో ఎక్కువ మంది పూర్తికాల ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండేలా చూసుకుంది. సరాసరి 30 ఏళ్ళ వయసు వారిని ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు.
ఇక ఈ అధ్యయనం వెల్లడించిన అంశాల్ని గమనిస్తే.. కూడు, గూడు, గుడ్డ ఎంత ముఖ్యమో ఇంటర్నెట్ కూడా అంతే ముఖ్యమని అంతర్జాతీయంగా 33 శాతం మంది, భారతదేశంలో 95 శాతం మంది కళాశాల విద్యార్థులు, యువ ఉద్యోగులు ఏమాత్రం సంకోచం లేకుండా స్పష్టం చేశారట. ఇంటర్నెట్ అనేది తమ జీవితంలో అంతర్భాగమై ఉందని 55% మంది విద్యార్థులు, 62% మంది ఉద్యోగులు నొక్కి చెప్పారు. ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు (64%) కారుకు బదులు ఇంటర్నెట్‌కే ఓటు వేశారు. సామాజిక జీవితంలోకి తొంగి చూస్తే డేటింగ్ లేదా మిత్రులతో గడపటం లేదా సంగీతం వినడం కంటే ఇంటర్నెట్‌లో మునిగి తేలడంలో ఉన్న ఆనందమే వేరంటున్నారు ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు (40%).
సామాజిక సంబంధాలంటే వీరి దృష్టిలో Facebookలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండటమే! కళాశాలల్లో 90 శాతం మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగుల్లో 88 శాతం మందికి Facebook ఖాతా ఉందిట. (మనం ఈ విశేషాల్ని పరికిస్తున్న సమయానికి ఈ శాతాలు మరింత పెరిగి ఉండవచ్చు)... వీరందరిలోనూ 81% మంది విద్యార్థులు, 75% మంది ఉద్యోగులు వారానికొకమారైనా తమ Facebook పేజీని వీక్షిస్తారట. ఇక రోజుకు కనీసం ఐదు సార్లు Facebookను చూస్తుంటామంటున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరు (33%).
ఈ రకమైన జీవనశైలి నేపథ్యంలో కళాశాల విద్యార్థులు, యువ ఉద్యోగులు TVని దాదాపుగా పక్కన పెట్టేసి Laptopలు, Smartphoneలనే ఎక్కువగా వినియోగించుకుంటున్నారట. విద్యార్థుల్లో కేవలం 6%, ఉద్యోగుల్లో కేవలం 7% మంది మాత్రమే TVకి ముఖ్యమైన స్థానాన్నిచ్చారు. TV ప్రోగ్రామ్‌లు Mobile పరికరాల్లోనూ ప్రసారమవుతున్నందున వీటిలో downloadల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వార్తాపత్రికల విషయానికి వస్తే 25 మంది విద్యార్థులు, ఉద్యోగుల్లో (4%) ఒకే ఒక్కరు మాత్రమే దినపత్రికలకు వారి జీవితంలో ముఖ్యమైన స్థానాన్నిచ్చారు. ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు రెండేళ్ళుగా బుక్ స్టోర్ నుంచి పుస్తకాల్ని కొనడమే లేదట (అవసరమైన Text book తప్ప..). వీరంతా Information Technology సాధనాలపైనే ఆధారపడ్డారని అర్థం చేసుకోవాలి.
విద్యార్థుల్లో రెండు వంతుల మంది (66%), ఉద్యోగుల్లో దాదాపు సగానికి పైగా (58%) Laptop, Smartphone, Tablet లాంటి Mobile పరికరాలకు తమ జీవితంలో అత్యున్నత సాంకేతిక సామగ్రిగా చోటిచ్చారు. మొత్తంగా చూస్తే రాబోయే కాలంలో Desktopల స్థానాన్ని Smartphoneలు గణనీయంగా ఆక్రమిస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. 19 % మంది విద్యార్థులు రోజువారీగా ఇప్పటికే Smartphoneలను ఉపయోగిస్తూ దీనిని అత్యంత ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు.
భారత్‌లో 71 మంది Mobile పరికరాలకు జైకొట్టగా, మనకంటే ఎక్కువగా UKలో 74% మంది, మన తర్వాత ఆస్ట్రేలియా (66%), చైనా (62%), అమెరికా (62%) వాసులు దీనివైపు మొగ్గు చూపారు. మన దేశంలో యువ ఉద్యోగులు Smartphone అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారట.