Go Search

 

బ్లాగ్ నుంచి ఇ-బుక్ రిలీజ్

 

పుస్తక రచన అనేది చాలా పెద్ద విషయంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే ఏ అంశం మీద అయితే పుస్తకాన్ని రచించాలని భావిస్తారో ఆ అంశానికి సంబంధించి లోతైన అవగాహన, సునిశిత పరిశీలన అవసరమన్నది నిర్వివాదాంశం. అయితే, కాలానుగుణంగా పుస్తక రచన తీరుతెన్నుల్లోనూ మార్పులు వచ్చేశాయి. అందులోనూ ఇప్పుడు నడుస్తున్నది కంప్యూటర్ యుగంలో వెబ్ సైట్లు, బ్లాగుల కాలం. ఈ సాంకేతిక విప్లవం పుస్తక రచన, ఆవిష్కరణ కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసింది. ఇదెలాగో చూద్దాం...

 

మామూలుగా అయితే సంస్థలు నడిపే వెబ్ సైట్లు వార్తలు, సినిమా విశేషాలు, వ్యాసాలు, సాహిత్యం ఇలా ఎన్నో విషయాల కలగలుపుగా అంటే ఒక పత్రిక తరహాలో ఉంటాయి. కాగా వ్యక్తులు నడిపే

వెబ్ సైట్లు, బ్లాగులు వారి అభిరుచుల మేరకు అంటే... ఒక నిర్దిష్ట అంశం ప్రాతిపదికన విషయాల్ని కలిగి ఉంటాయి. అంటే, కేవలం సినిమాలు, జోకులు, సైన్స్ లేదా సామాజిక అంశాలు, వ్యక్తిగత విషయాలు, సాహిత్యంలో కథలు లేదా కవితలు... ఇలా ఏదో ఒక అంశం మీదనే సదరు వ్యక్తుల వెబ్ సైట్ లేదా బ్లాగ్ నడుస్తుంటుంది. వ్యక్తులు నడిపే వాటిలో ప్రస్తుతం బ్లాగులే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మన రచనల్ని పుస్తక రూపంలో తీసుకురావాలంటే ప్రచురణకర్తకు మన అంశం నచ్చి ఉండాలి (మార్కెట్ ప్రమాణాలు, వాణిజ్య విలువలు ఆధారంగా...). ఎలాగో కష్టపడి పుస్తకం ప్రచురించాక దానిని మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. బ్లాగులకు ఈ సమస్య లేదు. ఇక్కడొక సంగతేమిటంటే తగిన సరుకు ఉండి, దానిని పుస్తక రూపంలోకి తీసుకురావాలన్న కోరిక తీరనివారు చాలామంది ఇప్పుడు బ్లాగర్ల అవతారం ఎత్తారు.

 

ఇక యూనికోడ్ ఫాంట్ వచ్చిన తర్వాత వెబ్ సైట్లు, బ్లాగుల్లో ప్రాంతీయ భాషల రచనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆదరణ పొందిన పలు బ్లాగ్ ఆగ్రిగేటర్లను చూస్తే ఈ విషయం తెలుస్తుంది. బ్లాగుల్లో పలు రంగాలకు సంబంధించి వివిధ అంశాలపై వాడివేడిగా చర్చోపచర్చలు, వాదోపవాదాలు, స్పందనలు ప్రతిస్పందనలు, లోతైన వ్యాసాలు, విశ్లేషణలు ప్రాంతీయ భాషల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియలో రచయితలు, వివిధ రంగాల నిపుణులు విస్తృతంగా పాల్గొంటున్నారు. వీరిలో అన్ని వయసులవారూ ఉన్నారు.

 

ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలు ఎంత ఆసక్తికరంగా మారాయంటే... ఫలానా బ్లాగ్ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి తదుపరి టపా (పోస్ట్) మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూచేంతగా బ్లాగర్ల రచనలుంటున్నాయి. ఇలా దాదాపు ఒక వందో లేక నూటయాభయ్యో పోస్ట్‌లు పడ్డాక వాటికి వచ్చిన ఆదరణను బట్టి సదరు బ్లాగర్ ఇ-బుక్ రిలీజ్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే... ఆ బ్లాగ్‌లోని ముఖ్యాంశాలు లేదా మొత్తం అంశాలకు ఒక ఇ-బుక్ ఆకృతినిచ్చి భావసారూప్యత కలిగిన వారికి పంపిణీ చెయ్యడంతో ఇ-బుక్ రిలీజ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

 

సదరు బ్లాగ్‌కు స్పందన చాలా బాగుందనుకున్నప్పుడు దానికి వాస్తవ పుస్తకరూపమిచ్చి పుస్తకావిష్కరణ ఏర్పాట్లు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.