ఇవిగో వచ్చేశాయి ఈ-బేబీకేర్ సెంటర్లు
(e-Babycare centers for you)
వేగంగా పరుగులు తీస్తున్న నేటి కార్పోరేట్ సమాజంలో హైటెక్ అమ్మానాన్నలకు బేబీకేర్ సెంటర్ల అవసరం ఇంకా పెరిగింది. ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు లేదా ఒంటరి తల్లులకు వారి పిల్లల్ని సాకే ఆశాకిరణాలు ఇవే. ఆఫీసులో పనిచేసుకునే అమ్మ తనువు మాత్రమే అక్కడుంటుంది తప్ప మనసంతా బేబీకేర్ సెంటర్లో ఉన్న తన ‘బేబీ’ మీదే ఉంటుంది. తన పాప, బాబు ఎలా ఉన్నారో... ఏమైనా తిన్నారో లేదో, సమయానికి నిద్రపోతున్నారో లేదో... ఇదే ఆందోళనతో ఆపీసులో అమ్మ మనసు కలవరపడుతూనే ఉంటుంది.
మామూలుగా అయితే ఇలా బేబీకేర్ సెంటర్లో పిల్లల్ని ఉంచుకోవడమనేది కొన్ని సమయాలకే పరిమితమై ఉంటుంది. అంటే ఉదయం 8 లేదా 9 గంటల నుంచి సాయంత్రం... రాత్రి 6 లేదా 7 గంటలవరకే పరిమితంగా ఉంచుకుంటారు. మరి, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ప్రాజెక్ట్ పనుల మీద రేయింబవళ్ళూ రకరకాల షిఫ్ట్‌లలో పనిచేసేవారికి ఈ పరిమిత సమయాలు ఇబ్బందకరమే. అందుకే 24 గంటలూ సేవలందించే బేబీకేర్ సెంటర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగులు ఆపీసులకు వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా వీకెండ్స్‌లో సినిమాలు, షికార్లకు వెళ్లినప్పుడు కూడా ఆ కొన్ని గంటల పాటు వారి పసిపాపల్ని ఇక్కడ విడిచిపెట్టవచ్చు.
ఇక్కడే ఒక సరికొత్త సాంకేతిక కోణం ఉంది. అదేమిటంటే... తల్లిదండ్రులు ఆఫీసుల్లోను, చిన్నారులు బేబీకేర్ సెంటర్లలోనే ఉన్నప్పటీకీ పిల్లలు ఎలా ఉన్నారో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశాన్ని ఈ ఎలక్ట్రానిక్ బేబీకేర్ సెంటర్లు కల్పిస్తున్నాయి. పిల్లల్ని ఈ తరహా ఈ-బేబీకేర్ సెంటర్లలో చేర్చినరోజునే వారికి ఐడీ నెంబర్, పాస్‌వర్డ్ (దీనిని తర్వాత మార్చుకోవచ్చు) ఇస్తారు. బేబీకేర్ సెంటర్లో పిల్లలు ఉండే విశాలమైన ఉండేగది, ఆవరణలో అమర్చి ఉన్న శక్తిమంతమైన వెబ్ కెమెరాలు వారి ప్రతి కదలికనూ ప్రత్యక్ష ప్రసారాలుగా చూపిస్తుంటాయి. ఇక తల్లిదండ్రులు వారి ఆఫీసులో ఉంటూనే ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి తమ పిల్లల ఆటపాటల్ని నేరుగా ఆస్వాదించవచ్చు.
మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే... పిల్లలు అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు నిర్వాహకులు వారిని ఇతరులతో కలపకుండా వేరుగా ఉంచి కబురు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసులో ఉన్న ఉద్యోగులు నెట్‌లో పిల్లలను గమనిస్తూ వారికి ఇవ్వాల్సిన మందుల గురించి అప్పటికప్పుడే నిర్వాహకుల్ని సంప్రదించి సూచనలివ్వవచ్చు.
ఇప్పుడు వస్తున్న అత్యాధునిక మొబైల్ ఫోన్లలో కూడా వెబ్ సైట్లను వీక్షించే అవకాశం ఉన్నందువల్ల అమ్మానాన్నలు ఆఫీసులోనేకాదు మరెక్కడున్నా ఆ చిట్టి తెరలో తమ బుజ్జాయిల్ని చూసుకోవచ్చు.