Go Search

ఎంసెట్కు పూర్తిస్థాయి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ

 

 

    రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్ (Engineering Agriculture and Medicine Common Entrance Test) పరీక్షకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలని అధికార్లు నిశ్చయించారు. ఈ పరీక్షను నిర్వహించే JNTU యాజమాన్యం ఇకపై ముద్రిత దరఖాస్తు ఫారాలకు స్వస్తి పలుకుతున్నది. దీంతో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు గతంలో అమలులో ఉన్న రెండు అప్లికేషన్ల పద్ధతికి తెరపడింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్లోనే సంబంధిత ఐచ్ఛికంపై క్లిక్ చేసి నిర్ణయించవచ్చు.

 

   పరీక్షకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ ఫీజును AP Online, E-సేవ, మీ సేవ లేదా తపాలా కార్యాలయాల నుంచి చెల్లించవచ్చు. అవకాశమున్నవారు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్లు ఉపయోగించి కూడా ఆన్లైన్లోనే ‘Make Payment’ బటన్ నొక్కి ఈ రుసుమును చెలించవచ్చు. అయితే మొదటి పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపులు చేసేవారు తప్పనిసరిగా వారి పేరు, అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు (10వ తరగతి, ఇంటర్), తండ్రి పేరు, పుట్టినతేదీ, మొబైల్ నెంబర్, ఏ విభాగంలో పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు వంటి వివరాలు ఇచ్చి తీరాలి. వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు (Transaction Id) తో కూడిన రసీదు వస్తుంది. ఈ రసీదులోని గుర్తింపు సంఖ్యను ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. Debit, Credit కార్డ్ల ద్వారా ఆన్లైన్లో చెల్లింపులు చేసినవారికి కూడా ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది.

 

   ఈ రకంగా చెల్లింపులు పూర్తయి, ఆన్లైన్ దరఖాస్తులో వివరాలన్నీ సక్రమంగా ఇచ్చిన తర్వాత వీటిని నిర్ధారిస్తూ ఒక ధృవీకరణ పత్రం సదరు విద్యార్థులకు ఇ-మెయిల్ అవుతుంది. ఏమైనా సందేహాలుంటే వెబ్సైట్లోని సూచనల విభాగంలో నివారించుకోవచ్చు. ఈ ధృవీకరణ పత్రం అందిన తర్వాత కూడా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉన్నా లేదా ఆన్లైన్లో దరఖాస్తు నింపేటప్పుడు తప్పులు జరిగినా ఆందోళన అవసరం లేదు. ఏ విధమైన తప్పు జరిగిందో, ఎలాంటి మార్పు కావాలో తెలియజేస్తూ ఎంసెట్ కార్యాలయానికి ఈ-మెయిల్ చేస్తే తాజా ద్రువీకరణ పత్రం అందే ఏర్పాటు చేస్తామని ఎంసెట్ కన్వీనర్, JNTU ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచీ ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులోకి రానుండగా, ఏప్రిల్ 26 నుంచి పరీక్ష మొదలయ్యే రోజు అంటే, మే 12 వరకూ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

   గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై అంతగా అవగాహనలేని విద్యార్థులకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ నింపడంలో తోడ్పాటునిచ్చేందుకు గాను ఇంజనీరింగ్ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఆపరేటర్లు సైతం ఉన్నారు.

 

   తాజా విధానంతో కాగితాల్ని గంటలకొద్దీ నింపే ఇబ్బందులు తప్పి అటు విద్యార్థులకు, ఇటు సిబ్బందికీ బోలెడు సమయం ఆదా కానుంది. ICR-OMR షీట్లో బబ్లింగ్ చేయాల్సిన పని లేదు. మౌస్ ద్వారా సంబంధిత బటన్ను క్లిక్ చేస్తే చాలు.  ఆన్లైన్లో అప్లికేషన్ నింపే ప్రక్రియలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ హాల్టికెట్ నంబర్లు కూడా ఇవ్వాలి కనుక ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా నిరోధించేందుకు ఆ వివరాలతో ఆన్లైన్లోనే సరిపోల్చి తనిఖీ చేస్తారు.


 

Read More on...

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.