ఆన్‌లైన్ సేవలందిస్తున్న పోలీస్ శాఖ
(Police dept. offers online services)

 

ఇప్పటికే తమ వెబ్‌సైట్ ద్వారా విశేషరీతిలో సమాచార సేవలందిస్తూ ప్రజాదరణ పొందిన హైదరాబాద్ పోలీస్ విభాగం ఈ సేవల్ని ఇంకా విస్తృతపరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇ-మెయిళ్ళు, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫిర్యాదులందుకుంటూ వాటిని యథాశక్తి పరిష్కరిస్తున్న పోలీస్ శాఖ అంతర్గతంగా సమాచార చేరవేత కార్యకలాపాలకు సైతం ఎస్ఎంఎస్‌లను ఉపయోగించుకుంటున్నది. ఇవే కార్యకలాపాలను ఇతర రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా నిర్వహిస్తున్నాయి.

 

e-Magazine


ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే ప్రజలకు వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు e-Magazine ఒక దానిని మాసపత్రికగా అందించాలని ఈ నగర పోలీస్ శాఖ సంకల్పించింది. నగరంలో జరుగుతున్న నేరాలు - ఘోరాలు, ప్రమాదాలపై పౌరులకు అవగాహన కల్పించి తగిన సలహా సూచనలతో వారిని అప్రమత్తం చెయ్యడం దీని లక్ష్యం. నెటిజన్లకు ఈ e-Magazineను ఉచితంగానే అందించాలని అనుకుంటున్నారు. ఇది ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. వాస్తవానికి దేశంలోనే ఇదొక వినూత్న తరహా ప్రయోగం.

 

ట్రాఫిక్ అలర్ట్స్


హైదరాబాద్ నగరంలో నానాటికీ ఎక్కువవుతున్న వాహనాలతో ట్రాఫిక్ పెరిగిపోతుండటం నగరజీవికి ఆందోళన కల్గిస్తున్న ఒక అంశం. ఈ నేపథ్యంలో నగరవాసులకు ఎస్ఎంఎస్‌ల రూపంలో అలర్ట్స్ అందించాలన్నది కూడా మరో ఆలోచన. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ప్రక్రియ ఇప్పటికే అమలులో ఉంది. కాగా ఈ ఒక్క విషయంలో Fm Radioలు ఒకడుగు ముందుకేసి ట్రాఫిక్ స్థితిగతులపై రేడియో జాకీల ద్వారా సమాచారం ఇస్తుండటం తెలిసిన విషయమే

.

e-చలానాల స్టేటస్


ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే ఉల్లంఘనుల భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇప్పటికే e-చలాన్ విధిస్తున్నది. ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు దీని స్టేటస్‌ను తెలుసుకునే అవకాశం కల్పించే దిశగా ప్రతిపాదనలకు రూపకల్పన చేసింది. కాగా, ఇతర కేసుల స్టేటస్ గురించి మాత్రం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరాలు ఉపయోగించి ఉల్లంఘనకు పాల్పడే వాహనదార్ల వివరాల్ని కంప్యూటరీకరిస్తున్నారు. దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరుతున్నందున చట్టవిరుద్ధంగా వాహనాల వినియోగాన్ని అరికట్టేందుకు కూడా ఇది సహకరిస్తుంది.

ఎస్ఎంఎస్‌ల ద్వారా అందుకునే ఫిర్యాదులు, ఉపయుక్త సమాచార పంపిణీకి సంబంధించి హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే కొన్ని గుర్తుల్ని కేటాయించింది. ట్రాఫిక్ – T, ఉగ్రవాదం – TE,  క్రైం – C, మహిళ – W.

నేరపరిశోధన, కేసుల దర్యాప్తులో పోలీసు శాఖకు సహకరించే నేరపరిశోధన సాఫ్ట్‌వేర్ ఒకదానిని Microsoft సంస్థ గతంలోనే రూపొందించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలీస్ శాఖ తాజా ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సత్వరం కేసుల్ని పరిష్కరించగలరని ఆశిద్దాం.